తెలంగాణలో కాంగ్రెస్ క్రమంగా పుంజుకుంటున్నట్లు తెలుస్తోంది. 125 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న హస్తం పార్టీకి క్షేత్రస్థాయిలో మంచి బలం ఉంది. కానీ సరైన నేత లేకపోవడం.. నేతల మధ్య సఖ్యత లేకపోవడం ఆ పార్టీకి ప్రతిబంధకంగా మారింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ తన మైలేజీని పెంచుకోలేకపోయింది.
రెండు సార్లు అధికారం కోల్పోయి చతికిల పడింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కొంత ఊపు వస్తున్నట్లు కనిపిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
అయితే కాంగ్రెస్ ఇదే వాడిని కొనసాగిస్తూ.. కలిసికట్టుగా ముందుకెళ్తే కేసీఆర్ ను ఎదుర్కొవడం సులువైన పనే.. కానీ ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు ఐక్యంగా లేనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారశైలి పార్టీ నష్టం కలిగించేలా ఉంది. కోమటిరెడ్డికి నల్గొండతోపాటు రాష్ట్రంలో పేరున్న అతని సోదరుడు బీజేపీలో చేరడం, వెంకట్ రెడ్డి పూటకో మాట మాట్లాడడం ఇబ్బందిగా మారుతుంది. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేత చెరుకు సుధాకర్ గౌడ్ కుమారుడికి ఫోన్ చేసి బెదిరించడం చేశాడు.
అయితే రాష్ట్రంలో బీజేపీ కూడా పట్టు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. అయితే ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం లేదు. కమలం పార్టీ కేవలం నేతల చేరికపై ఆధారపడి ఉంది. ఇప్పుడిప్పుడే ఆ పార్టీ క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటుంది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ తమ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడితే మధ్యలో బీఆర్ఎస్ గట్టు ఎక్కుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్, బీజేపీ చీలిస్తే బీఆర్ఎస్ కు కలిసి వస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. అయితే ఇసారి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు అవకాశం ఇద్దామనే భావనలో ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా గ్రామస్థాయి నుంచి ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతోంది. ప్రజులు ఎటు వైపు వెళ్తారో..

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి